Sunday, September 7, 2014

'కుక్కపిల్ల', 'అగ్గిపుల్ల', 'సబ్బుబిళ్ళ' మీద రాసేదే కవిత్వమా?


శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారి 150వ జయంతి సంవత్సరం ముగిసింది. ఆమహనీయుని 150వ జయంతిని (కేంద్ర) సాహిత్య అకాడమి సంస్మరించాలా లేక సంగీత నాటక అకాడమి సంకీర్తించాలా అనే మీమాంసలో ఆ రెండు అకాడమీలు పడ్డాయని ఆ మధ్య ఒక తెలుగు దినపత్రికలో వచ్చిన వ్యాసంలో వ్రాసారు. కుకపిల్ల’, ‘అగ్గిపుల్ల’, ‘సబ్బుబిళ్ళమీద రాసే కవిత్వానికి పట్టం కట్టేసే సాహిత్య అకాడమికి నారాయణ దాసుగారి హరికథలలొ సాహిత్యంకనపడకపోవడంలో ఆశ్చర్యం లేదు మరి!  

ఆదిభట్ల నారాయణ దాసు గారి పేరు వినగానే ముందుగా మనకు స్ఫురించేది హరికథా పితామహుడు”! చేతిలో చిడతలు, మెడలో పూలమాల, బంగారు గొలుసు, ముంజేతికి సువర్ణ ఘంటా కంకణం, ఎడమ కాలికి గండపెండేరం, అధోభాగాన పట్టు పీతాంబరం - ఆరడుగుల ఆజాను బాహుడు అయిన దివ్యసుందర విగ్రహం, మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అవును, అయన హరికథకు సృష్ట్తికర్త. మానవ జాతికి భక్తి, జ్ఞాన, మోక్ష మార్గములను ప్రబోధించే లక్ష్యంతో అయన హరికథను సృష్ట్తించారు. తాను సృష్టించిన హరికథను తన మృదు, మధుర మేఘగంభీర స్వరంతో పాడి, ఆ హరికథలలోని పాత్రలను అభినయించి, సుమారు ఆరు సుదీర్ఘ దశాబ్దాలు ప్రేక్షకుల హృదయాలలో నర్తించిన ఆయన అమరుడు, చిరస్మరణీయుడు. అయితే హరికథ సృష్టి, సంగీత, సాహిత్యాలలో, ప్రదర్శన కళలలో ఆయన కనపరచిన ప్రతిభా పాటవాలలో ఒక చిన్న భాగం మాత్రమే.   

ఆదిభట్ల నారాయణ దాసు గారు, అష్టభాషలలో పండితుడు. సంగీత సాహిత్యాలలో అసమాన ప్రతిభావంతుడు. తెలుగు, సంస్కృతము, అచ్చ తెలుగులలో అనేక గ్రంధాలు రచించారు. అందులో కావ్యాలు, ప్రబంధాలు, సంగీత ప్రబంధాలు, వేదాంత గ్రంధాలు, అనువాదాలు, హరికథలు, రూపకాలు, పిల్లల నీతికథలు, ఉన్నాయి. అచ్చమైన తెలుగును వాడుకలోనికి తీసుకు వచ్చి ప్రచారం చేయాలనే సదుద్దేశంతో ఆయన సీమ పల్కు వహిఅనే పేరుతొ అచ్చతెలుగు – తెలుగు నిఘంటువును రచించారు. ప్రేక్షకులను రంజింప చేయగల దేవదత్తమైన మధుర గంభీర స్వరం అయన స్వంతం. ఏక కాలంలో అయిదు, ఆరు తాళాలు ప్రదర్శించగల లయ-తాళజ్ఞాన ప్రతిభ ఆయనకు దేవుడిచ్చిన వరం.

అయన ప్రదర్శించిన అష్టావధానాలలో, గ్రీకు భాషలో వ్యస్తాక్షరి, మూడు తాళాలకు సమన్వయించి కీర్తనను పాడడం, ఆంగ్లభాషలో ప్రసంగం మొదలైన, ఇతర అవధానులు ప్రదర్శించని అంశాలు ఉండేవి. అందుకే దానిని అసాధ్య-అష్టావధానంఅనీ సంగీత అష్టావధానంఅనీ పిలిచేవారు.

దాసుగారు ఆంగ్ల, పారశీక భాషలనుండి తెలుగులోనికి అనువదించారు. ఋగ్వేద మంత్రాలను అచ్చతెలుగులోనికి అనువదించి స్వరపరిచారు. తెలుగు, సంస్కృత భాషలలో అయన రచించిన దశ విధ రాగ నవతి కుసుమ మంజరితొంభై రాగాల మాలిక; అపూర్వము, అనన్యసామాన్యమైన ఆయన వాగ్గేయకార ప్రతిభకు నిదర్శనము.

చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారు ఆయనను పుంభావ సరస్వతిఅని కీర్తించారు. సంగీత, సాహిత్యాలను సరితూచిన త్రాసు, ఆదిభట్ల నారాయణ దాసు!అన్నాడు శ్రీ శ్రీ. హిందుస్తానీ రాగాల ఆలాపనలో తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించి, అయన రబింద్రనాథ్ టాగోర్ గారి ప్రశంసలు అందుకున్నారు; మైసూరు మహారాజా వారి పురస్కారాలు అందుకున్నారు. విజయనగరం మహారాజు ఆనంద గజపతి రాజు గారు ఆయనకు ఇంతకూ ముందెప్పుడూ, ఏ పండితునికీ లభించని సన్మానం చేయాలనే సంకల్పంతో దక్షిణ భారతంలోనే మొదటిదైన సంగీత కళాశాలను స్థాపించి, దానికి ఆయనను మొట్ట మొదటి అధ్యక్షులుగా నియమించారు.  

ఆనాటి సంగీత, సాహిత్య పండిత లోకం ఆయనను సంగీత సాహిత్య సార్వభౌమ”, “పంచముఖి పరమేశ్వర”, “లయబ్రహ్మమొదలైన బిరుదులతో సత్కరించింది. బ్రహ్మరధ సన్మానాలూ, గజారోహణలూ ఆయనను వరించాయి. సంస్కృతభాషలో అద్భుతమైన పదజాల, వ్యాకరణ ప్రజ్ఞ ఉన్న ఆయనకు తెలుగు భాష అంటే చాల మక్కువ. అందుకే తనకు డెబ్భై అయిదవ ఏట, సన్మానం చేసి బిరుదు ప్రదానం చేస్తానని కోరిన భారతి తీర్థ అనే సాహిత్య, సంస్కృతీ సంస్థకు, తనకు ఇచ్చే బిరుదు తెలుగులో ఉండాలని షరతు విధించారు. ఆయన తెలుగు భాషాభిమానాన్ని గౌరవించిన ఆ సంస్థ ఆట పాటల మేటిఅనే బిరుదు ప్రదానం చేసింది. 

No comments:

Post a Comment